Sunday 6 October 2013

ఎన్నేళ్ళ దుఖం ఇది


ఎన్నేళ్ళ దుఖం ఇది
ఎన్ని తరాల నిరీక్షణ ఇది
నాలుగున్నర కోట్ల
ప్రజల ఆవేశాలు ..ఆవేదనలు
కన్నీళ్లు ..దోపిడీలు ..దౌర్జన్యాలు ..
జాగీరుదారులు ..దొరలూ .రజాకార్లు
పెట్టుబడిదారులు ..ఆంధ్రుల ఆధిపత్యాలు
ఒకటా రెండా
కొన్నేళ్లుగా నా తెలంగాణా
దిశ మొలతో నిలబడ్డది
విపణి వీధిలో
అంగడి సరుకై పోయింది ..!

ఇప్పుడు నా తెలంగాణా
కొందరి చేతుల్లోనే
బందీ అయిపోయింది
బడుగులు ..పేదలు ..మైనార్టీలు ..
పల్లెలు అన్నీ దిక్కులేనివిగా మారాయి
ప్రతి ఒక్కరు జై తెలంగాణా
అంటూ నినాదాలు చేసే వాళ్ళే
కానీ అందులో బలిదానాలు
చేసుకున్న వాళ్ళు ఎందరో ..!

కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు
జై అంటూ మరో దోపిడీకి
తెర లేపారు
కొలువులు లేవు ..పదవులు లేవు
బతికేందుకు దారులు లేవు
అన్నీ ఆకాశ హార్మ్యాలే
కళ్ళు చెదిరే ఐటి కంపెనీలే ..!

తెలంగాణా మాగాణం
రియల్ దందాగా మారింది
మళ్ళీ ఈ దొంగలే
తెలంగాణా పేరుతో
మోసం చేసేందుకు
రెడీ అయ్యారు
ఇప్పుడు ఇంటి దొంగలపై
పోరాటం చెయ్యాలి
జన తెలంగాణా
వచ్చేదాకా పోరాటం చేయాలి ..!!

No comments:

Post a Comment